संग्रहालय को और जानें

ప్రారంభం

సాలార్‌జంగ్‌ కుటుంబం కళల పట్ల చూపిన అభిమానానికి ఈ మ్యూజియం సజీవ సాక్ష్యం. 1951 డిసెంబర్‌ 16వ తేదీన తొలి ప్రధాని శ్రీ జవహర్‌లాల్‌ నెహ్రూ గారు ప్రజల సందర్శన కోసం అధికారికంగా ప్రారంభించారు.

ఈ మ్యూజియం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో మూసీనదికి దక్షిణ తీరాన ఉంది. ఇది ప్రపంచంలోని పెద్ద మ్యూజియంలలో ఒకటి, భారతదేశంలో 3వ స్థానాన్ని ఆక్రమించింది.

కళాసంపదకు చిరునామా

ఈ మ్యూజియం ప్రసిద్ధికెక్కిన కళాసంపదకు చిరునామా. ఇక్కడి వస్తువుల్లో అధిక భాగం సాలార్‌జంగ్‌-3 అనబడే నవాబ్‌ మీర్‌ యూసుఫ్‌ అలిఖాన్‌ యూరప్‌, ఆసియా, మధ్య తూర్పు దేశాల నుండి సేకరించినవే. కళల పట్లగల అభిమానంతో కళాకృతులను సేకరించడం అనేది సాలార్‌జంగ్‌ కుటుంబ సంప్రదాయంలా మారి మూడు తరాల వరకు కొనసాగింది.

ఈ సేకరణలో ముసుగులో ఉన్న రెబెకా స్వచ్ఛమైన పాలరాతి విగ్రహం. దీన్ని ఒకటవ సాలార్‌జంగ్‌ రోమ్‌ నుంచి సేకరించారు. ఫ్రాన్స్‌కు చెందిన 16వ లూయి, మైసూరు మహారాజు టిప్పు సుల్తాన్‌కు బహుకరించిన రెండు దంతపు కుర్చీలు ఉన్నవి. జేడ్‌తో చేసిన బుక్‌ స్టాండ్‌, షంసుద్దీన్‌ అల్తమిష్‌ అనే పేరున్న రెహల్‌, మొగల్‌ చక్రవర్తి షాజహాన్‌ బిరుదైన సాహిబ్‌-ఎ-కిరన్‌-ఎ సాని అని చెక్కిన విలుకాని రింగ్‌ మ్యూజియానికి గర్వకారణాలు. జేడ్‌తో చేసిన జహంగీర్‌ డాగర్‌, విలువైన రాళ్ళు పొదిగిన పళ్ళు కోసే కత్తి నూర్‌జహాన్‌కు చెందింది ఇక్కడ కొలువుదీరినవి.

ఇక్కడ లెక్కకు మిక్కిలి అద్భుతమైన సూక్ష్మచిత్రాలున్నాయి. ఇవి 14, 15 శ|| చెందిన పశ్చిమ భారతశైలిలో వేయబడినవి. ఇందులో కృష్ణలీలలు అనేక విధాలుగా పలు భంగిమలలో చిత్రించబడ్డాయి. 19వ శ||కి చెందిన అరబిక్‌, పర్షియన్‌ వ్రాతప్రతులతో బాటు ఫిరదౌసి రచించిన షా-నామా కూడా ఇక్కడుంది. ఈ మ్యూజియంలో లీలావతి అనే గణితానికి సంబంధించిన అరుదైన గ్రంథముంది. అంతేకాదు ప్రాచీన వైద్య విజ్ఞాన సర్వస్వముంది. యూరోపియన్‌ వస్తువులలో ఆయిల్‌ మరియు వాటర్‌ కలర్‌ పెయింటింగ్‌లు ఉన్నాయి.

समय का कालातीत रखवाला :

సందర్శకుల్లో అధిక సంఖ్యాకులు ఉత్సాహంతో చూసేవాటిలో క్లాక్‌ రూమ్‌ ఒకటి. ఇక్కడ ప్రాచీన సూర్య గడియారాల నుండి పెద్ద గడియారాల వరకు, యూరోపియన్‌ దేశాలైన ఫ్రాన్సు, ఇంగ్లాండు, స్విట్జర్లాండ్‌, జర్మనీ, హాలెండ్‌ మొ|| దేశాల నుండి సేకరించిన ఆధునిక గడియారాల వరకు ఉన్నాయి. వీటిలో పంజరపు గడియారం, బ్రాకెట్‌ గడియారం, గ్రాండ్‌ ఫాదర్‌ గడియారాలు, స్కెలిటన్‌ గడియారాలు ఎన్నో రకాలున్నాయి. అన్నిటికంటే అద్భుతమైనది ఇంగ్లాండులోని కుక్‌ అండ్‌ కెల్వే కంపెనీ వారి మ్యూజికల్‌ గడియారం. దీన్ని 3వ సాలార్‌జంగ్‌ కొన్నారు. ప్రతి గంటకు ఒక టైం కీపర్‌ గడియారపు పై భాగం గది నుండి బయటికి వచ్చి ఎన్ని గంటలయితే అన్ని గంటలు కొట్టడం దీని విచిత్రం.

మ్యూజియంలో ఆసక్తిని గొలిపేవి ఎన్నో ఉన్నాయి. వాటిలో మధ్య, పశ్చిమ, తూర్పు బ్లాకుల్లో యూరప్‌, చైనా, జపాన్‌, నేపాల్‌, మయన్మార్‌, మధ్య తూర్పు దేశాలు ఇంకా ఇండియాలోని పలుప్రాంతాల నుంచి సేకరించిన అపురూపమైన కళాత్మక వస్తువులున్నాయి.