గ్రంథాలయం

img

సాలార్‌జంగ్‌ మ్యూజియం లైబ్రరీ

యాక్ట్‌ ఆఫ్‌ పార్లమెంట్‌ ద్వారా 1961లో మ్యూజియం లైబ్రరీ ప్రజల కోసం తెరవడం జరిగింది. నాణ్యత దృష్ట్యా ఈ లైబ్రరీ ప్రపంచంలో అత్యుత్తమ శ్రేణికి చెందినది. ఇక్కడ అందమైన, అలంకారిక రూపభేదాలతో, కళ్ళు చెదిరే అలంకారాలతో, లోహపు రంగులు, బంగారు సిరా వాడి రాసిన లిఖిత ప్రతులున్నాయి. తెలుపు, నీలం, ఎరుపు, ఆకుపచ్చ సిరాలను వాడినవి. చిత్రకారులు, లేఖకులు, బైండింగ్‌ చేసేవారు వారి అనుభవాన్ని, నైపుణ్యాన్ని రంగరించి వీటిని సిద్ధం చేసారు.

ఈ లైబ్రరీలో సాలార్‌జంగ్‌ కుటుంబానికి చెందిన పుస్తకాలు, లిఖితప్రతులు ఉన్నాయి. కొన్ని పుస్తకాలు క్రీ.శ.1656 నాటివి. ఒకటవ సాలార్‌జంగ్‌ అయిన నవాబ్‌ మిర్‌ తురాబ్‌ అలీఖాన్‌ పూర్తిస్థాయి లైబ్రరీగా రూపొందడానికి కృషి చేసారు. దాన్ని మరింత అభివృద్ధి చేసినవారు ఆయన కుమారుడు నవాబ్‌ మీర్‌ లాయఖ్‌ అలీఖాన్‌ అనే సాలార్‌జంగ్‌-2. తుదిరూపు నిచ్చిన వారు నవాజ్‌ యార్‌ యూసఫ్‌ అలీఖాన్‌ (సాలార్‌జంగ్‌-3) లిఖితప్రతులు, పుస్తకాలు ఉన్న విభాగం రెండో అంతస్తులో ఉంది. ఇక్కడ ముద్రిత పుస్తకాలు 62,072 ఉండగా, 41,208 ఇంగ్లీషువి, 13,027 ఉర్దూ, 1108 హిందీ, 1105 తెలుగు, 3576 పర్షియన్‌, 2588 అరబిక్‌, 160 టర్కిష్‌ భాష పుస్తకాలున్నవి. కళ, నిర్మాణ కళ, పురావస్తు శాస్త్రం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రాలు, సాహిత్యం, చరిత్ర, యాత్ర రచనలు ఇలా ఎన్నో విషయాల పుస్తకాలున్నవి. అంతేకాదు ఇస్లాం, హిందూమతం, క్రైస్తవానికి చెందినవి ఉన్నాయి. ఇంగ్లీషులో 1631లో ముద్రితమైనది అన్నింటికంటే ప్రాచీనమైనది. అక్కడితో ఆగకుండా లైబ్రరీలో కళ, శిల్పం, చిత్రలేఖనాలు, పింగాణి వస్తువులు, ఆలంకారిక వస్తువులు, యాత్రలకు సంబంధించిన క్రొత్తవాటితో ఎప్పటికప్పుడు చేరుస్తూ ఉంటారు.

మ్యూజియం ఉద్యోగులే కాకుండా, ఇతర ప్రాంతాలవారు, విదేశీయులు లైబ్రరీని తరచుగా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఎందరో వారి అభ్యసనాన్ని మరింత మెరుగు పెట్టుకోవడానికి ఇక్కడి గ్రంథాలను ఉపయోగిస్తుంటారు.

ప్రచురితమైన పుస్తకాల సేకరణ


ఇంగ్లీషు విభాగం

ఇంగ్లీషు విభాగంలో దాదాపు 40,000 పుస్తకాలున్నవి. వీటిలో అరుదైన పుస్తకాలు కూడా ఉన్నాయి. వీటిలో చరిత్ర, తత్వ శాస్త్రం, ఇంజనీరింగ్‌, బయాలజీ, సాహిత్యం, జీవిత చరిత్రలకు సంబంధించినవి ఉన్నాయి. లైబ్రరీలో క్రీ.శ.1631 నాటి రిచర్డ్‌ నోల్స్‌ రచించిన 'జనరల్‌ హిస్టరీ ఆఫ్‌ టర్క్స్‌' అనేది అతి పురాతన పుస్తకం. కొన్ని పుస్తకాల మీద రచయితల సంతకాలు కూడా ఉన్నవి. లీవ్స్‌ ఫ్రంది జర్నల్‌ ఆఫ్‌ అవర్‌ లైఫ్‌ ఇన్‌ ది హైలాండ్స్‌ ఫ్రం 1848 టు 1861 అనే పుస్తకాన్ని విక్టోరియా మహారాణి ఒకటవ సాలార్‌జంగ్‌కు బహూకరించింది కూడా ఇక్కడ కనిపిస్తుంది. జనమ్‌ సఖి అనే గురునానక్‌ జీవిత చరిత్ర కూడా ఉంది. ఇంగ్లీషులో అనువాద పుస్తకాలు కూడా ఉన్నవి. కథాసరిత్సాగరం అనే భారతీయ ప్రాచీన గ్రంథం అనువాదం ది ఓషన్‌ ఆఫ్‌ స్టోరీస్‌ అనే పేరుతో ఇక్కడుంది. ప్రపంచానికి చెందిన చరిత్ర పుస్తకాలు కొల్లలుగా ఉన్నవి.

ఓరియంటల్‌ సెక్షన్‌

ఈ విభాగంలో దాదాపు 19000 ముద్రిత పుస్తకాలున్నవి. అందులో 13000 ఉర్దూ, 2500 అరబిక్‌, 3500 పర్షియన్‌, 15 టర్కిష్‌ పుస్తకాలు. వీటిలో అనేక విషయాలకు సంబంధించినవి ఉన్నాయి. ఇస్లాం సాహిత్యం, చరిత్ర, వైద్యం అనేక దేశాలకు చెందినవి ముఖ్యంగా ఇరాన్‌, ఇరాక్‌, సిరియా, భారతదేశం, పాకిస్తాన్‌ దేశాలవి ఉన్నాయి. ఉర్దూలో ప్రముఖ ప్రాచీన కవుల రచనలు కూడా ఇందులో చూడొచ్చు.

లిఖిత ప్రతుల సేకరణ

ఈ లిఖిత ప్రతులు అనేక సాధానాలపై వ్రాసి ఉన్నవి. ముఖ్యంగా ఎండితన తోలు, వస్త్రం, తాటాకు, కాగితం, గాజు, చెక్క, రాయి ఇలా అనేక సాధనాలపై, వివిధ భాషలలో అరబిక్‌, పర్షియన్‌, ఉర్దూ, టర్కిష్‌, దక్కనీ, పుష్టు, హిందీ, సంస్కృతం, తెలుగు, ఒరియా భాషల్లో 84 విషయాలపై రాసి ఉన్నవి. వివిధ సంప్రదాయాలకు చెందిన సూక్ష్మ చిత్రకళ ప్రతులు కూడా ఉన్నవి.

వీటిలోని సబ్జెక్టులు అనేక రంగాలకు సంబంధించినవి. ముఖ్యంగా వైద్యం, సైన్సు, తత్వం, వ్యవసాయం, కాలిగ్రఫీ, నిఘంటువులు, గణితం, భౌతికశాస్త్రం, జ్యోతిష్యం, ఆటలు, కళలు, సంగీతం, చరిత్ర, కవిత్వం, జీవిత చరిత్రలు, ఫిలాసఫీ, భాషా శాస్త్రం, రాజనీతి, యాత్ర, ఖురాన్‌ సంబంధ శాస్త్రాలు, సూఫీతత్వం, న్యాయశాస్త్రం, ఇంద్రజాలం, బాణ విద్య మొదలైనవి.

లిఖిత ప్రతుల్లో భారతీయ ధర్మం, ఇస్లాం, క్రైస్తవం, జొరాస్ట్రియనిజం లకు సంబంధించినవి ఉన్నాయి. ప్రతులు రకరకాల ఆకారాల్లో, రూపాల్లో, సైజులో ఉన్నవి. గుర్తుంచుకోవలసింది, గర్వించవలసిందీ ఏంటంటే పవిత్ర ఖురాన్‌కు లిఖిత సూక్ష్మ పుస్తకాలు ప్రపంచంలో రెండే ఉన్నవి. ఒకటి ఇరాన్‌లో ఉండగా, రెండవది మన మ్యూజియంలో ఉన్నది. దీని సైజు 2.4 సె.మీ. అలాగే 60 I 30 సె.మీ,తో అతిపెద్ద ఖురాన్‌ కూడా ఇక్కడుంది. రకరకాల చేతిరాతతో కుఫ్తి, తుల్త్‌, నష్క్‌, తాలిఖ్‌, నాష్టాలిఖ్‌, గుబర్‌, రైహన్‌, శికస్తా, దివాని, రిఖా, బహార్‌, తుగ్రా, మాకుస్‌ లిపుల్లో రకరకాల రూపాల్లో ఉన్నవి.

అరబిక్‌ లిఖిత ప్రతులు

లైబ్రరీలో అరబిక్‌ భాషలో 2500 లకు మించిన వ్రాత ప్రతులున్నవి. వీటిలో క్రీ.శ.847కి చెందిన షార్షు ముక్తాసార్‌ ఆల్జీబ్రాపై రాసిన గణిత పుస్తకం అరుదైనది, అపూర్వమైనది. ఖగోళ శాస్త్రంలో గ్లోబ్‌ తయారీ, ఉపయోగాలు (16వ శ||) వైద్యంపై అవిసెన్నా రచించిన కిలాబుల్‌ ఖానున్‌ అనే పుస్తకం, హయాతుల్‌ హైవాన్‌ రాసిన నాచురల్‌ హిస్టరీ గ్రంథం, 16వ శ|| చెందిన రసియాల్‌ఖావానస్‌ సఫా చేసిన ఎన్‌సైక్లోపీడియా, తత్వశాస్త్రంలో 1628కి చెందిన నసీరుద్దీన్‌ తుసి రాసిన గ్రంథం, అలా షార్హిల్‌ మలాలి వ్రాతప్రతులు (ఇవి చక్రవర్తి జహంగీర్‌ లైబ్రరీలోనివి) ఉన్నవి. ఇవేకాక షియాలు, సున్నీలు చేసే ప్రార్థనలున్న అడియా గ్రంథం, సూఫిజంకు సంబంధించిన గ్రంథాలు కూడా ఉన్నవి. క్రీ.శ.1675 కాలానికి చెందిన 'సూఫీయిజం నియమాలు వాటి పరిచయం' అనే అరుదైన పుస్తకం కూడా ఇక్కడుంది. క్రీ.శ.1218కి చెందిన అబునస్ర్‌ కూర్చిన నిఘంటువు, జైయుల్‌ ఖవాయిద్‌ అనే వ్యాకరణ గ్రంథం (క్రీ.శ.1576) ఇక్కడున్నాయి. ఇది మ్యూజియంకు గర్వకారణమైన గ్రంథాల్లో ఒకటి.

పర్షియన్‌ వ్రాతప్రతులు

ఇక్కడ 4700 పర్షియన్‌ లిఖిత గ్రంథాలున్నవి. అతిముఖ్యమైనది బుఖారా సంప్రదాయానికి చెందిన 20 చిత్రాలున్న గ్రంథము. ఇది ప్రఖ్యాత దస్తూరి నిపుణుడు మిర్‌ అలి హర్వి చేత తయారుచేయబడినది. అన్నింటికంటే ప్రాచీనమైన ప్రతి క్రీ.శ.1207 కాలపు సున్ని వారి పవిత్ర గ్రంథము. అలాగే క్రీ.శ.1588కి చెందిన అతివిలువైన బాయాజిద్‌ బుస్తామి అనే సంధి వివరాలున్న గ్రంథము ఇక్కడుంది.

ఇక్కడ కళ, సైన్సు, ఖగోళ విజ్ఞానం, ఇంద్రజాలం, విలువిద్య కి సంబంధించిన వ్రాతప్రతులున్నవి. వ్యవసాయానికి సంబంధించినవి, విలువైన రాళ్ళకు సంబంధించిన విషయాలను తెలిపే వ్రాతప్రతులున్నవి. షాజహాన్‌ కొరకు రచించిన రెండు వంటల పుస్తకాల ప్రతులున్నవి. అత్తరు తయారీ తెలిపేవి కూడా ఉన్నవి.

మహమ్మద్‌ అర్‌ రాడి షాజహాన్‌ కోసం రచించిన పర్షియన్‌ పుస్తకం ప్రాచీన వైద్య శాస్త్రానికి సంబంధించింది ఇక్కడుంది. అతిప్రాచీన వైద్య విజ్ఞాన సర్వస్వ వ్రాతప్రతి ఇక్కడున్నది. క్రీ.శ.1281 కి చెందినది, ఫిరోజ్‌షాకు అంకితం చేయబడ్డ జంతుశాస్త్ర పుస్తక ప్రతి అతి ప్రాచీన ప్రతుల్లో ఒకటి ఇక్కడ కొలువుదీరింది.

ఉర్దూ, టర్కిష్‌, పుష్టు, హింది, ఒరియా వ్రాతప్రతులు

సాలార్‌జంగ్‌ మ్యూజియం లైబ్రరీలో వివిధ విషయాలను గురించిన 1200 ఉర్దూ వ్రాతపతులున్నాయి. అందులో రాజు మహమ్మద్‌ ఖులీ రచించిన దివాన్‌-ఎ-ఖులి కుతుబ్‌షా పుస్తకం, ఇబ్రహీం అదిల్‌ షా రచన నురుస్‌ అనేవి ప్రముఖమైనవి. అరుదైన గణిత పుస్తకం లీలావతి, టర్కిష్‌ భాషలో రాసిన 25 రాతప్రతులున్నవి. హిందీ రాతప్రతులు పర్షియన్‌ లిపిలో రాసినవీ ఉన్నాయి. జైన కల్పసూత్రాలు రాసి ఉన్న మడతలు పెట్టిన పెద్ద కాగితాలున్నవి. ఒరియా, సంస్కృతం, తెలుగు భాషల్లో చరిత్ర, వైద్యం, తంత్రాలు, కవిత్వం గురించి రాయబడిన తాళపత్రాలున్నవి.

పరిశోధన మరియు ప్రచురణ

లిఖిత ప్రతుల వివరాలున్న వివరణాత్మక 19 క్యాటలాగులను మ్యూజియం ప్రచురించింది. ప్రతిదాంట్లో పుస్తకం, పేరు, రచయిత, రాసిన కాలం, చిత్రాలు, ముద్రలు, సంతకాల వివరాలున్నాయి. అరుదైన పవిత్ర ఖురాన్‌ను ప్రచురించింది. దీనిలో మడత పెట్టిన 30 పెద్ద కాగితాలలో గ్రంథమంతా ఇమిడి ఉంది. ప్రతి లైనూ అరబిక్‌ భాష తొలి అక్షరమైన అలీఫ్‌తో మొదలై ఉండడం దీని ప్రత్యేకత. ఈ విభాగం వారు ఎండిన తోలు, కాగితాల గురించి పరిశోధన చేసారు.