వెస్ట్రన్‌ బ్లాక్‌, మొదటి అంతస్తు

యూరోపియన్‌ పోర్సిలిన్‌

మ్యూజియంలోని పింగాణీ వస్తువులు ఫ్రాన్సు, జర్మనీ, యుకె, ఇటలీ నుండి వచ్చినవి. ఇక్కడి సేకరణలో జర్మనీవారి డ్రెస్డెన్‌ పోర్సీలీన్‌, ఫ్రాన్స్‌వారి పింగాణి మ్యూజియంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకున్నవి. పోర్సిలీన్‌ను స్థూలంగా రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి దృఢమైన పింగాణి, రెండవది మృదువైన పింగాణి.

మ్యూజియంలో అద్భుతమైన పనితనానికి గుర్తుగా అనేక పోర్సిలీన్‌ వస్తువులు ఫ్యాక్టరీ గుర్తులతో సహా ఉన్నవి. సర్వీస్‌ పోర్సిలీన్‌ అనేది నెపోలియన్‌, 14వ, 15వ, 16వ లూయీల కాలంలో వారి ప్రోత్సాహంతో మొదలయ్యింది. మాడామ్‌ డి పోమ్‌పడోర్‌, మేరి ఆంటోనెట్టి అందమైన చిత్రలేఖనాలున్న పోర్సిలీన్‌ వస్తువుల తయారీకి ఆసక్తిని చూపించారు. కళాకారులను ప్రోత్సహించారు. అలా తయారు చేయగలిగిన వాటిలో చాలావరకు ఆ కాలపు యూరప్‌, ఆసియా లోని చక్రవర్తులకు, రాజులకు బహూకరించబడ్డాయి.

పదిహేనవ లూయి, పదహారవ లూయి, ఒకటో నెపోలియన్‌కు చెందిన పింగాణి వస్తువులెన్నో మ్యూజియంలో మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా తయారీదారు ముద్రలతో ఉన్నవి. నెపోలియన్‌ కాలంలోని వస్తువులకు ఎమ్‌ అనే అక్షరం ముద్రగా వేసారు. ఇవన్నీ 1804 నుండి 1808 మధ్య కాలంలో తయారైనవి. 16వ లూయీ కి చెందిన రెండవ కాథరీన్‌కు బహుమతిగా ఇచ్చిన రెండు సెర్వెస్‌ వాజ్‌లు ఇక్కడున్నాయి.

డ్రెస్డన్‌ పోర్సిలిస్‌ ప్రాధాన్యతలో సెన్సెస్‌ తర్వాతి స్థానాన్ని ఆక్రమిస్తుంది. పోలాండ్‌ రాజైన రెండో అగస్టస్‌ 18వ శ|| తొలి భాగంలో డ్రెస్డెన్‌కు కొద్ది దూరంలో మైసెన్‌లో పోర్సిలీన్‌ ఫ్యాక్టరీకి తన ప్రోత్సాహాన్ని అందించాడు. అనుకోకుండా దృఢమైన పోర్సిలిన్‌ తయారీకి అవసరమైన కావోలిన్‌ జర్మనీలో దొరుకుతుందని బయట పడడంతో డృఢమైన పోర్సిలిస్‌ తయారీకే పుష్కలంగా రాజవంశం అండదండలు పుష్కలంగా లభించాయి.

ఈ మ్యూజియంలో అపూర్వమైన డ్రెస్డెన్‌ పోర్సిలిస్‌ వస్తువులు అనేకం ఉన్నాయి. ప్రతి వస్తువు క్రింది భాగంలో తయారు చేసిన ఫ్యాక్టరీ ముద్రలుండటంతో ఈ విషయం బయటపడింది. ఇంగ్లీషు పోర్సిలిస్‌లో నానారకాల వస్తువులు 19వ శ|| తయారైనవి ఉన్నాయి. అరుదైన వస్తువులలో కప్పులు, సాసర్లు, పళ్ళాలు, మూర్తులు ఉన్నాయి. ఈ సేకరణలో వర్సెస్టర్‌, చెల్సీ, డెర్పీ, వెడ్జ్‌వుడ్‌, మిల్టన్‌ ఫ్యాక్టరీ వస్తువులున్నాయి.

వెడ్జ్‌వుడ్‌ పోర్సిలిన్‌ రకం ఒక ప్రత్యేకమైన కళ. బర్స్‌లెమ్‌లో 17వ శ||లో వెడ్జ్‌వుడ్‌ పాటరీని జోసయ వెడ్జ్‌వుడ్‌ ప్రారంభించారు. క్రమంగా ఇది ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధిగాంచిన పాటరీలలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఈ ఫ్యాక్టరీలో తయారైన ఫ్లవర్‌వాజులు మ్యూజియంలో ఉండడం మనకు గర్వకారణం.