ఈస్ట్రన్‌ బ్లాక్‌, మొదటి అంతస్తు

ఫార్‌ ఈస్ట్రన్‌ విభాగం

ఈ గ్యాలరీలో నేపాల్‌, టిబెట్‌, బర్మా దేశాల కళా సంస్కృతుల అందమైన కలయిక మనసులను ఆనందపరవశులను చేస్తుంది. ఇక్కడ దారువు, లోహం, కంచుతో చేసిన వస్తువులున్నాయి. వీటిలో చాలా భాగం బౌద్ధ సంస్కృతికి సంబంధించినవి.

అద్భుతమైన రాగి, కంచు శిల్పాలు నేపాల్‌ ప్రత్యేకత. వీటిలో గుళ్ళో వాడే కంచు దీపాలు, కుక్రీలు, డాగర్లు, రెండు బౌద్ధ దేవతల విగ్రహాలు ముఖ్యమైనవి.

దేవాలయాల్లో వాడే దీపస్తంభాలు రెండు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి ఈ విభాగంలో ఉన్నవి. వీటిలో గణేశుడు చెక్కబడి ఉన్నాడు. ఒకదానిలో గణేశ విగ్రహం పై భాగంలో బౌద్ధ దేవత చెక్కితే, రెండో దాంట్లో ఇవే వ్యతిరేక క్రమంలో ఉన్నవి. బౌద్ధులు విఘ్నాంతక దేవుని కొలుస్తారు. ఆయన మన గణేశుని వలె విఘ్న నాశకుడు. వీటిని బౌద్ధ మందిరాల్లో వాడటం కోసమే తయారుచేసారని చెప్పవచ్చు.

తార అనే బౌద్ధ దేవత విగ్రహం చిన్న సైజులో ఉండి, సెమి ప్రెషియస్‌ రాళ్ళతో అలంకరించినదాన్ని ఇక్కడ చూడొచ్చు. క్రిస్టల్‌తో తయారుచేసి, టర్కోయిస్‌ ఎగేట్‌తో చేసిన హారాన్ని దీనికి అలంకరించారు. 19వ శ||కి చెందింది ఇది. సెమిప్రెషియస్‌ రాళ్ళతో అలంకరించిన అందమైన నేపాల్‌ కుక్రీలున్నాయి.

మతం, సంస్కృతి, కళల విషయంలో నేపాల్‌కు, టిబెట్‌కు ఎన్నో పోలికలున్నాయి. టిబెట్‌ సంప్రదాయంలో భాగమైన రాగి టీ పాత్రలు, టంగ్‌కాలున్నాయి (స్క్రోల్‌ పెయింటింగ్‌లు) వీటి తయారీలో నేపాల్‌, టిబెట్‌లు అత్యున్నతస్థాయిని అందుకున్నవి. ఇవి ఈ దేశాల్లో ముఖ్యమైన కళారూపాలు. మ్యూజియంలో కొన్ని టంగ్‌కాలున్నవి. వాటిలో ఒకదాంట్లో ప్రాచీన గురువైన పద్మసంభవుని జీవిత చరిత్ర చిత్రించబడింది. ఇతడు లామాయిజం స్థాపకుడు. ఇది ఒక బౌద్ధమత శాఖ. ఇది 18 లేదా 19వ శ||కి చెందినది.

బర్మా మన దేశానికి చాలా దగ్గరగా ఉన్నందున దీనిపై బౌద్ధ, హిందుమతాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. దారుశిల్పకళలో ప్రపంచంలో ఏ దేశమూ బర్మాకు సాటి రాదు.

మ్యూజియంలో ఉన్న దారుశిల్పాలు చక్కని నగిషీతో గుండ్రంగా అనేక వరుసలలో చెక్కి ఉన్నాయి. మృదువైన చెక్క, వెదురుపై లక్కపూత వేసి, దానిపై ఆకర్షణీయంగా బంగారు, ఎరుపు, నలుపు రంగులద్దిన కళాకృతులున్నవి.

దీర్ఘ చతురస్రాకారపు టేకుకర్రపై బుద్ధుని జనన ఘట్టాన్ని గోడకు తగిలించేలా చెక్కారు. చివరలు ఫిలిగ్రీ పనితనంతో ఉన్నవి. అంచులపై 12 రాశుల చిత్రాలున్నవి. ఇది 19వ శ|| కి చెందింది. వీటిలో రెండు బంగారు, నలుపు రంగులతో అలంకరిస్తే, మిగిలినవి జామెట్రీ ఆకారాలలో ఉన్నాయి. మ్యూజియంలో తప్పక చూడాల్సిన వాటిలో ఇవే ఉంటాయి.