సెంట్రల్‌ బ్లాక్‌, మొదటి అంతస్తు

పిల్లల గ్యాలరీ

మ్యూజియంలోని ఈ విభాగంలోని వస్తువులు మూడవ సాలార్‌జంగ్‌ కున్న బహుముఖ ఆసక్తులకు అద్దం పడుతాయి. విభిన్న రంగాలకు చెందిన వస్తువులిక్కడున్నాయి. ఆయన బాల్యంలో సేకరించినవి కూడా ఇక్కడున్నాయి. ఇక్కడి వస్తువులు పిల్లలకు వినోదంతోపాటు విజ్ఞానాన్నీ అందిస్తాయి.

కంచు విగ్రహాలు, పింగాణి వస్తువులు, సంగీత పరికరాలు, పాలరాతి శిల్పాలతోపాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల బొమ్మలూ ఉన్నాయి. జపాన్‌ గెయిషా బొమ్మలు, ఇంగ్లాండు నడిచే రైలు బొమ్మ, స్నోవైట్‌ ఏడుగురు మరుగుజ్జులు ఈ విభాగంలో కనిపిస్తాయి. ఇక్కడుండే బొమ్మలు యువకులతో బాటు, పెద్దవారినీ ఆకర్షిస్తాయి. సైనిక పటలాలు రెండో ప్రపంచ యుద్ధరంగాన్ని, దాని వ్యూహాలను కళ్ళముందు ప్రత్యక్షం చేస్తాయి. ఫిరంగిదళం, కాల్బలంతో పాటు వాయుసేన, యుద్ధటాంకులు, వైద్య సిబ్బంది సహా ఉన్నవి.

మనోరంజకంగా తీర్చిదిద్దిన అడవి జంతువులు, కంచు లోహంతో చేసిన ఏనుగులు, రైనోలు, పూలు మొ|| ప్రదర్శనలో ఉన్నవి. పెంపుడు జంతువుల మట్టి నమూనాలు, సోప్‌స్టోన్‌లో చెక్కిన కొరియా జపాన్‌ బొమ్మలు, ఆల్చిప్పలతో అలంకరించిన వస్తువులు, లోహ-పింగాణితో చేసిన వివిధ జాతుల శునకాల శిల్పాలు ఈ గ్యాలరీలో కనువిందు చేస్తాయి.