సెంట్రల్‌ బ్లాక్‌, క్రింది అంతస్తు

ఆయుధాలు, కవచాలు

''నేను (దేవుడు) సృష్టించిన ఇనుము మానవులకు చాలా ఉపయోగకరమైనది.'' ఇది మ్యూజియంలో ఉన్న పర్షియన్‌ ఖడ్గంపైన చెక్కబడి ఉన్న శ్లోక పాదం. పర్షియాలో ఫౌలాద్‌-ఎ-హింద్‌ అనే మాటను శక్తి సామర్థ్యాలకు పర్యాయపదంగా ఉపయోగిస్తారు. ప్రపంచమంతా భారతీయ స్టీలును విలువైనదిగా గౌరవిస్తారు. డమాస్కస్‌ బ్లేడులు, టొలిడో బ్లేడుల తర్వాత పేరుగాంచింది. నిజానికివి భారతీయ స్టీలుతో చేసినవి.

ఈ మ్యూజియంలో ఉన్న ఆయుధాలు, కవచాలు అరుదైన సంపద. వీటిలో 1200కి పైగా ప్రాచీన కాలానికి చెందిన ఆయుధాలు, తుపాకులు ఉన్నాయి. మ్యూజియం రికార్డుల ప్రకారం 196 తుపాకులున్నాయి. అందులో మాచ్‌లాక్‌, ఫ్లింట్‌లాక్‌, మజిల్‌ లోడింగ్‌ చేసే గన్నులు, పిస్టోళ్ళు, రివాల్వర్‌లు ఉన్నాయి. వీటితోబాటు మ్యూజియంలో ఖడ్గాలు, డాగర్లు, కవచాలు, బల్లాలు, శిరస్త్రాణాలు, కవచాలు ఉన్నాయి. 16వ శ|| నుండి 20వ శ|| కు చెందిన అపార ఆయుధ సంపద ఇక్కడుంది.

ఇక్కడ కేవలం మన దేశం నుండే గాక పర్షియా, టర్కీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, నేపాల్‌, ఇంగ్లాండు, బర్మా, జపాన్‌ల నుండి వచ్చిన ఆయుధాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి.

ఇక్కడి ఖడ్గాలు, డాగర్లు, తబార్లు, శిరస్త్రాణాలు అన్నీ డమాస్కస్‌ స్టీలుతో చేయబడినవి. వీటి మీద ప్రసిద్ధిచెందిన పర్షియన్‌, టర్కీ కళాకారుల గుర్తులు, సంతకాలున్నవి. పూర్వం ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పర్షియన్‌ కమ్మరులు తమ స్వంత పరిశ్రమలలో మనం ఆర్డరిచ్చిన విధంగా ఆయుధాలను తయారు చేయించి, సంస్థ ముద్రను వేసి అమ్మిన కత్తుల నిక్కడ చూస్తారు.

ఇండియా యూరప్‌లోని అన్ని ప్రాంతాల నుండి బ్లేడులను, డాగర్లను దిగుమతి చేసుకునేది. యూరప్‌ బ్లేడులు సునిశితమైనవి, మంచి పాలిష్‌తో వెండిలా మెరవడమే కారణం. వీటిమీద రోమన్‌ భాషలో సంకేత లిపితో ఫ్యాక్టరీ ముద్రలుండేవి. ఈ విదేశీ బ్లేడులు మన దేశంలో తయారయ్యే పిడికి జత చేయబడి, ఖడ్గాలు తయారయ్యేవి. అందువల్లనే వీటిని ఫిరంగులనేవారు. 17వ శ||కి చెందిన ఎస్పాడియేరో దల్రేజ్‌ అనే ఫిరంగి ఈ రకంగా తయారయ్యింది ఈ మ్యూజియంలో ఉన్నది.

మ్యూజియంలో ఇంకా నేపాల్‌ ఖడ్గాలు, బర్మాకు చెందిన క్రి ఖడ్గాలు, జపాన్‌ సమురాయ్‌ కత్తులు ఉన్నవి. ఈ ప్రదర్శనలో అతి విలువైనవాటిలో అందంగా చెక్కిన దంతపు సీ బోర్డులు, జపాన్‌ ఖడ్గాలు చెప్పుకోదగినవి. కళాకారుల అద్భుత పనితనానికి ఇవి చిహ్నాలు.

ఇక్కడున్న తుపాకులు ఇంతే ప్రసిద్ధి గలవి. వాటిలో మాచ్‌లాక్స్‌, ఫ్లింట్‌లాక్స్‌, గన్నులు, పిస్టళ్ళు అనేకమున్నవి. టిప్పు సుల్తాన్‌ పేరున్న రివాల్వర్‌ ప్రత్యేకమైనది. ఈ విభాగంలో చరిత్ర ప్రసిద్ధిచెందిన జహంగీర్‌, షాజహాన్‌, ఔరంగజేబ్‌, మహమ్మద్‌ ఘాజీ వంటి వారి ఆయుధాలునన్నవి.